మైదాతో కలాకన్.. మైసూర్ పాక్ ..ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ల తనిఖీల్లో వెల్లడి

మైదాతో కలాకన్.. మైసూర్ పాక్ ..ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ల తనిఖీల్లో వెల్లడి
  • స్వీట్ కంపెనీ, రెండు హోటళ్లు సీజ్

కరీంనగర్, వెలుగు: పాలతో తయారు చేయాల్సిన స్వీట్లను మైదాతో తయారు చేస్తుండడం ఫుడ్  సేఫ్టీ ఆఫీసర్ల తనిఖీల్లో వెల్లడైంది. కరీంనగర్  జిల్లా బావుపేటలోని శ్రీ బాలాజీ మ్యాజిక్  మిఠాయి కంపెనీలో గురువారం తనిఖీలు నిర్వహించగా అజ్మేరి కలాకన్​, మిల్క్  మైసూర్ పాక్ ను పాలకు బదులుగా మైదాను ఉపయోగించి అత్యంత అపరిశుభ్రమైన వాతావరణంలో తయారు చేస్తున్నట్లు గుర్తించారు. ఇక్కడ తయారయ్యే స్వీట్లు కరీంనగర్, సిరిసిల్ల, పెద్దపల్లి జిల్లాల్లోని పలు స్వీట్  షాపులు, బేకరీలకు సరఫరా చేస్తుంటారు.

ఈ షాపులో పరిశుభ్రత లోపాలు గుర్తించిన ఆఫీసర్లు.. 40 కిలోల కల్తీ స్వీట్లు(అజ్మేరి కలాకన్​, మిల్క్  మైసూర్  పాక్)ను ధ్వంసం చేశారు. కల్తీ స్వీట్ల తయారీని నిరోధించేందుకు 1,300 కిలోల ముడి పదార్థాలు(మైదా, చక్కెర)ను స్వాధీనం చేసుకున్నారు. ఈ సంస్థను వెంటనే మూసివేసి ఆహార భద్రత, ప్రమాణాల చట్టం -2006 ప్రకారం సంస్థ యొక్క ఎఫ్ఎస్ఎస్ఏఐ రిజిస్ట్రేషన్  సర్టిఫికెట్‌‌ను సస్పెండ్  చేసేందుకు చర్యలు ప్రారంభించారు.

రెండు హోటళ్లు సీజ్.. 

కరీంనగర్  గీతాభవన్  చౌరస్తాలోని ఫేమస్  హోటల్ ను ఎలాంటి  ఎఫ్ఎస్ఎస్ఏఐ లైసెన్స్  లేకుండా నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. దీంతో హోటల్‌‌ను వెంటనే మూసివేయించారు. ఎఫ్ఎస్ఎస్ఏఐ  లైసెన్స్  పొందిన తర్వాతే ఓపెన్  చేయాలని ఆదేశించారు. అలాగే గీతాభవన్ చౌరస్తాలోని మతామ్  అల్  హబీబి అరేబియన్  ఫ్యామిలీ రెస్టారెంట్ లో  ఆహార తయారీలో కృత్రిమ రంగులు ఉపయోగించవద్దని స్పష్టంగా సూచించినప్పటికీ, నిబంధనలను పాటించలేదు. కిచెన్ లో బొద్దింకలు సంచరిస్తున్నట్లు గుర్తించారు. 8 కిలోల హండీ రైస్ ను ఘటనా స్థలంలో పారవేయించారు. ఈ హోటల్  ఎఫ్ఎస్ఎస్ఏఐ లైసెన్స్‌‌ను సస్పెండ్  చేసి, హోటల్  మూసివేశారు. ఫుడ్  శాంపిళ్లను సేకరించి స్టేట్  ఫుడ్  ల్యాబ్ కు పంపించారు.